Shaktipatamu    Chapters    Last Page

శక్తిపాతము

చతుర్థ భాగము

కుండలినీతత్త్వము - తజ్జాగరణము.

మహాకుండలినీ ప్రోక్తా పరబ్రహ్మ స్వరూపిణీ |

శబ్దబ్రహ్మమయీ దేవీ యేకానేకాక్షరాకృతిః ||

---యోగకుండలి న్యుపనిషత్‌.

కుండలినీశక్తి పరబ్రహ్మ స్వరూపిణి. 'అక్షరం బ్రహ్మ సమ్మితం' - అధిష్ఠాన - అవస్థాన - అనుష్ఠాన - నామ - రూపముల యందు బ్రహ్మముతో సమాన. అనఁగా భేదము లేదనుట. మహాదేవి =మహాదేవ శబ్ద వాచ్య పరమాత్మ శక్తి దేవి = ద్యోతన క్రీడనశీల తన్ను దాను జగదాకారమున వెలయించుకొని, దానితో సృష్టి - స్థితి - లయ - తిరోధాన - అనుగ్రహము లనెడి పంచక్రీడల యందును బరాయణ, శబ్ద బ్రహ్మమయి = నాదస్వరూపిణి, ఓంకారస్వరూపిణి. ఏకాక్షరములుగాను, అనేకాక్షరములుగాను రూపొందిన మంత్రజాల మంతయు నామె స్వరూపమే. ప్రణవాంగములు = అకార - ఉకార - మకారములు. వ్యాకరణానుశాసనముచే 'ఓం' అయినది. అ కారము తమోగుణము, ఉకారము రజోగుణము, మకారము సత్త్వగుణము. గుణమనఁగా నవస్థావిశేషము. మఱి 'అర్ధ మాత్రాస్థితా నిత్యా యానుచ్చార్యా విశేషతః' (సప్తశతి). ప్రణవోచ్చారణాంతమునఁ గేవలానునాసిక నాదరూపమున సాగుచు నుచ్చారణ విశేషములు లేకయే క్రమముగా లీనమగునది 'యర్ధమాత్ర'. అదియే యాత్మయొక్క శుద్ధస్వరూపమును దెలుపును. దీని విశేషవివరణము గూర్చి 'సాథనసామగ్రి' నాలవ మూటయందలి 'బ్రహ్మకృతస్తుతి వ్యాఖ్య' యందుఁ జూచునది. అది తుదకు ఘంటానాదమువలె నెమ్మదిగాఁ బ్రహ్మమందు లీనమై పోవను. ఇదే కుండలినీ వర్ణనమందు మూఁడున్న ర చుట్లుగా వర్ణింపఁబడినది.

'మూలాధారే ప్రసుప్తా సా 'ఆత్మశక్తిః.'

ఆ యాత్మశక్తి 'కులకుండము, కుమారము' అను పేళ్ళతో యోగశాస్త్రమందు వ్యవహరింపఁబడిన మూలాధారమందు నిదురించుచుండును. అటులున్న కుండలిని తన నోరితోఁ దన తోఁకను గఱచి పట్టుకొని సుషుమ్నా ద్వారము నడ్డగించునటులు వర్ణింపఁబడెను. ఇది యంతయు వాస్తవముగా నాధ్యాత్మికశక్తి స్థితిని గూర్చి చేయఁబడిన వర్ణనమందలి యలంకృతభాష.

'ఉన్నిద్రితా విశుద్ధే తిష్ఠతి ముక్తిరూపా పరాశక్తిః'.

నిదురనుండి మేల్కొని లేచిన యీ పరాశక్తి విశుద్ధ చక్రమును జేరి ముక్తి రూపయై వెలయును.

శక్తి మేల్కొని నంతనే తన మూఁడు గుణముల (అవస్థల) బంధము వదలి పోవును. అపుడా కుండలిని తన చుట్లను విడిచి తిన్నని (వంకలులేని) సర్పాకృతి నొంది సుషుమ్న యందు సాగి తిన్నగా మీఁదికిఁ బోవును. ఈ మేలుకొనుటయు సుషుమ్నదారిని బామువలె మీఁదికి గపాలమువఱకుఁ బోవుటయు యోగులకు మాత్రమే ప్రత్యక్షము; అనఁగా ననుభూత మగును. దాని నడక పాము నడకవలెఁ దోచుట చేతఁ బాముతో నుపమింపఁ బడినది.

శ్లో|| యావత్‌ సానిద్రితా దేహే తావజ్జీవః పశుర్యథా|

జ్ఞానం న జాయతే తావత్‌ కోటియోగవిధైరపి||

దేహమందు నది నిద్రించి యున్నంతవఱకు మానవుఁడు పశువువలె వ్యవహరించును. ఏలన, శక్తి జాగరణము కానంత దాఁక యెన్ని యోగోపాయములు చేసినను బ్రహ్మజ్ఞానము కలుగదు.

కుండలిని యొక నాడి యని పలువు రనుకొందురు. కాని, వాస్తవముగా మూలకందమందు శక్తి ప్రసుప్తరూప మున నుండి, యచటినుండి మెల్లఁగా బయల్వెడలి సుషుమ్న యందు నెగఁబ్రాకఁజొచ్చును. మూలకందము అనంతశక్తి భండారము. శక్తి మేల్కొనగనే దాని యాధ్యాత్మిక చైతన్య స్వరూపము దేహ మనోవాక్కులయందు వ్యక్తమగును. యోగాభ్యాసము వలనఁ, దీవ్ర వైరాగ్యమువలనను శక్తి మేల్కొనును. జ్ఞాన - భక్తి దార్ఢ్యముల వలన సైతము మేల్కొనును. కేవల భాషాఝంకారము (శాబ్దిః జ్ఞానము) వలన దాని జాగరణము కాదు కనుకనే శ్రవణ - మనన - నిదిధ్యాసము లావశ్యకము లయ్యెను. 'అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ సిద్ధ్యతి' - అనెడి గీతా వాక్యాభిప్రాయమే యిది. యోగ మనఁగా నొక వస్తువులో నొక వస్తువును జేర్చి వేయుట 'అభ్యాస' మనఁగా వింట బాణము నెక్కిడి చక్కఁగాఁ జిమ్ముట. ప్రణవ మనెడి ధనుస్సునందు నాత్మను (అల్పాహంతను) శరముగాఁ జేసి, పూర్ణాహంతను (బ్రహ్మమును) లక్ష్యముగాఁ జేసి ప్రమాదపడక వేధింపవలెను. ఇదే యోగమనెడి యభ్యాసము. దీనినే భాష్యకారులు ''మహావ్రత'' మనిరి. ప్రాణాయామమువలన సైత మీ ప్రయోజనము సిద్ధించును. ప్రాణాయామ మనఁగాఁ బ్రాణ శక్తిని విస్తరిల్లఁ జేయుట. ఇది యష్టాంగ యోగముల యందలి నాలవ యంగము. ఈ ప్రాణాయామ విశేష జ్ఞాన మునకై నా 'సాధనసామగ్రియు' - 'సోహం సమాధియు' నను గ్రంథములయందుఁ గల వ్యాసమును జూచునది.

జాగరిత శక్తి క్రియలు.

శక్తి పాతమువలనఁ గుండలినీ జాగరణము విశేషించి యగును. శక్తిపాతమందలి విశేష మేమనఁగా శిష్యున కాయాసము లేకయే గురుకృప చేతనే శక్తి జాగరణము వడిగఁనగును. అట్లు కానిచోఁ గుండలినీ జాగరణ భాగ్యమునకై శిష్యుఁడు బహుకాలము కష్టసాధ్య ప్రయత్నములు చేయవలెను. ఒకప్పుడా ప్రయత్నములందు హానిని బొందవచ్చును. శక్తి జ్ఞానవతి యగుటచేఁ గ్రియావతియు నగుచున్నది. కుండలినీ పరాశక్తికి 'విద్యా, అవిద్యా' రూపములు రెండు చెప్పవచ్చును. ఈ వ్యష్టికుండలినీశక్తి కులకుండ మందు మేలు కొన కున్నంతసేపు బంధన కారణ మగును (జీవునకు). గురుకృపచే మేలుకొల్పఁబడిన యవస్థలో నదియే మోక్షప్రదయగును. జాగరిత కాఁగానే యామె యొకప్పుడు క్రియా రహితావస్థను, నొకప్పుడు క్రియాశీలావస్థను, నొకప్పుడు లయావస్థను - నిటులు మూఁడవస్థల నొందుచుండును. క్రియా రహితావస్థయందు మానవుని ప్రవృత్తి వివేక వైరాగ్యముల వైపొరగి యుండును. కాని మోక్షసాధన ప్రారంభము కాదు. శక్తి పాపములను నశింపఁ జేయుచుండును. పాపనాశన మైన తరువాత మోక్షయాత్ర ప్రారంభ మగును. మఱియు సమాధి యందు లేక మోక్షావస్థయందు శక్తి బ్రహ్మమందు లయమొందును.

క్రియావతి కాఁగానే సాధకులకు హఠయోగ సంబంధమైన వివిధాసనములు, ప్రాణాయామము, బంధములు, ముద్రలు, భక్తి యొక్క విభిన్నావస్థలు, అనఁగా నృత్యము, గీతము, ఉద్గీథము, ప్రణవోచ్చారణము, నామకీర్తనము. మంత్రజ్ఞాన యోగముల యనుభవము లనేకము లగుచుండును. ఈ క్రియకుఁ గారణము శక్తి క్రియావతీత్వమే. శక్తి యచేత నమే యయినచో దాని క్రియలు సచేతనములును, జ్ఞాన యుక్తములును గావు.

క్రియలు స్థూల - సూక్ష్మ - కారణ శరీరముల భేదములచేఁ బలువిధములుగా నగుచుండును. శక్తి మేల్కొనుట, క్రియాశీల మగుట యనువానిలో భేద మున్నది. క్రియాశీల యగుటతోడనే శారీరక - మానసిక క్రియలు వికసించును. కాని మేల్కొనుటమాత్రము చేతనే జరుగదు. స్థూల - సూక్ష్మ - కారణ వరీరముల యందలి క్రియలు వేర్వేఱుగా ననుభవమునకు వచ్చుచుండును. అనఁగా స్థూల శరీరానుభవములును, సూక్ష్మ శరీరానుభవములును, గారణ శరీరానుభవములును భిన్న భిన్నములుగా నుండుననియు భావము. మఱియు నెల్లరకు నీ యనుభవము లొక్కతీరుగా నుండవు. మనుష్యుల ప్రకృతులును, స్వభావములును వేర్వేఱుగా నుండును. కనుక వాని క్రియలును వేర్వేఱుగానే యుండును. కనుక మానవుల క్రియలును భిన్నభిన్నములే యగుచుండును. కనుకనే యిది 'స్వాభావికయోగ' మనఁబడును. దీనివలన నెవ్వరికిని హాని యగునని తలంపరాదు, ప్రాణాయామము, శీర్షాసనము మున్నగు నభ్యాసములు చేయువారు కొందఱు రోగగ్రస్తులగుటయుఁ గనుచున్నాము. కారణ మేమనఁగా నా క్రియలు వారికి ననుకూలములు కాకపోవుటే. శక్తి క్రియాశీల యైనంతనే స్వాభావిక క్రియలు వికసించును. మఱియు నవి దేశకాలర్తువుల ప్రభావమువలన సాధకుల శరీర మనః ప్రాణముల కనురూపముగాను, ననుకూలముగాను వెలయుచుండును.

క్రియలు శారీరకములు, వాచికములు, మానసికములు నని మూఁడు విధములుగా నగును. అవి సంస్కారమునకు లోఁబడినవి కావున నిచ్చకు లోఁబడినవి కావు. అవి శక్తి తంత్రములని తలంపవలయును. ఏలనఁగా శక్తి వేగమునుబట్టి పలువిధములైన క్రియలు ప్రారంభ మగును. రెండవశక్తి 'జ్ఞానవతి' యగుటచే నదియు స్వతంత్రయే. దాని వేగ మిచ్ఛా ధీనము కాదనియు ననరాదు. ఏలన, నిచ్చ కలిగినపుడు దాని వేగము నరికట్టవచ్చును. ఏ సాధకునకేని బహిరంగమున జనసంఘముతో నున్నపుడు వేగము కలిగెనేని గోరినచో శక్తి వేగము నాపుకొనఁగలడు. ఏలయనఁగా గ్రియ యెల్లపుడును నేకాంత స్థానమందో, గది తలుపులు మూసికొనియో చేయు విధానము లలవడి యుండును గాని, జనసముదాయమందుఁ గాదు. ఈ దినములలో నలుగురిలో నిల్చి భగవత్సంకీర్తనము చేయువేళ భావప్రదర్శనమునకై నాట్యము, గంతులు, చిత్రమైన యభినయము. ఒకప్పుడు తెలివి తప్పినటులు పడి పోవుట మున్నగు వినోదములను బ్రదర్శించు మహాత్ములను గనుచున్నాము. ఈ విధముగా జనసంఘ మధ్యమున నిట్టి క్రియలు చేయుటచే శక్తి యనుచితముగా వినియోగ పడుటయుఁ నది తగ్గిపోవుటయు నగును.

క్రియారంభ మగునపుడు ప్రాణాపాన వాయువు లుచ్చరింపఁ (మీదకి నడువ) జొచ్చు ననియు శక్తి జాగరణమువలనఁ బ్రాణశక్తి యుత్థిత యగునని మున్నంటిమి. ఇపు డిచటఁ గ్రియారంభ మగు ఫలముగాఁ బ్రాణాపానముల యుత్థాన మగుననుచున్నాము. దీనివలన నెంతో యధికకాల మభ్యాసము చేయఁగాఁ బ్రాణాపానము లుత్థితములై సాధనోన్నతి కగును.

ఘటావస్థ.

శక్తి సుషుమ్నయందుఁ బ్రవేశించి స్వాధిష్ఠానాది చక్రములను వేధింపఁ జొచ్చును. దానివలన నాడీశోధన మగును. సుషుమ్నతో నాడుల కన్నిఁటికి సంబంధము కలదు. అవి శాఖోపశాఖలుగానే యంగ ప్రత్యంగ ములందు వ్యాపించి యున్నవి. కనుకనే సుషుమ్న యందుఁ బ్రవేశించుటచేఁ జక్రము లను వేధించి (దూసికొనిపోయి) వేగముగా నాడీజాల మందం తటను వ్యాపించును; దీనికి దృష్టాన్త మేమనఁగా - లోతైన జలాశయమందు నింపఁబడిన నీరు వివిధ నాళముల దారిని బెద్ద వీథులలోనికి, నిండ్లోనికి, సందులలోనికిఁ బ్రవహించునపుడాయా గొట్టములయందు నడ్డుపడిన పదార్థములను దన వేగబలముచే నెట్టుకొనిపోయి, తనదారి చూచుకొనునటులే యని యెఱుంగునది.

ఈ శక్తి ప్రాణమయకోశమం దంతటను బ్రాణమును జైతన్యమును సంచలింపఁ జేయును. నాడీశోధనము కాఁగాఁ (నాడీజాల మంతయు శుద్ధమగుటవలన) బ్రత్యేక శాఖోప శాఖల యందును బ్రాణము వడిగా సంచరింపఁ జొచ్చును. మఱియుఁ బ్రాణశక్తి నఖశిఖాపర్యన్తము నిండును, ఈయవస్థనే శాస్త్రము 'ఘటావస్థ' యన్నది. క్రియలు మొదలగునపుడు ''ఆరంభావస్థ'' యనఁబడును. మఱియు నా యవస్థయందు శక్తి యూర్ధ్వగామిని యగుటచే నింద్రియము లంతర్ముఖములు కాఁ జొచ్చును. అనఁగా విషయములవంకఁ బరుగిడ మానును. మఱియు శక్తివేగముచేఁ బ్రాణమయకోశము ప్రాణముతో నిండినపు డదే ఘటావస్థ యనఁబడును. అపుడు ప్రాణాయామము సిద్ధించును. అనఁగాఁ బూర్తిగాఁ బ్రాణవిస్తృతి లాభమగును.

చతుర్విధ ప్రాణాయామ యజ్ఞసిద్ధి,

ఈ ప్రాణవిస్తృతి నాలుగు విధములుగాఁ గాననగును. 1. అపానమందుఁ బ్రాణము చేరుటయు, 2. ప్రాణమందు నపానము చేరుటయు, 3. రెండిఁటి గతి నిరోధమగుటయు, 4. ప్రాణమందుఁ బ్రాణము లయింపఁ జేయుటయు ననునవే నాలుగు విధములు. గీతయందు భగవానుఁడు నర్జునునకు యజ్ఞముల వర్ణనము చేయుచుఁ జెప్పుచున్నాఁడు.

శ్లో|| 'అపానే జుహ్వతి ప్రాణం ప్రాణపానం తథాపరే |

ప్రాణాపానగతీ రుధ్వా ప్రాణాయామపరాయణాః ||

అపరే నియతాహారాః ప్రాణాన్‌ ప్రాణషు జుహ్వతి |

సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః ||'

అనఁగా - గొంద ఱపానమందుఁ బ్రాణమును నాహుతిగా నిచ్చెదరు. మఱికొందఱు ప్రాణమందు నపానము నాహుతి చేయుదురు; కొందఱు ప్రాణాపానముల గతి నడ్డగించి ప్రాణాయామము చేయుదురు; వేఱొక కొందఱు నియతా హారులై ప్రాణమును బ్రాణమందే యాహుతి చేయుదురు - అనఁగా జేర్చి వేయుదురు ఈ నాలుగు తెగలవారును యజ్ఞ మన నేమో యెఱిఁగినవారే వీరీ విధమైన యజ్ఞమును జేసి పాపములను దొలఁగించు కొందురు.

ఈ నాలుగు విధములైన ప్రాణాయామములందును శ్వాసపూరణ - రేచన - కుంభనముల పని లేదు. శక్తి జాగరణ మగుచో రేచకపూరకములు లేకయే ప్రాణాయామము సిద్థించును. చెప్పెడి దేమనఁగా యథార్థ ప్రాణాయామము ప్రాణాపానముల చేరికవలననే జరుగును. ఇది పై శ్లోకమునుబట్టి పాఠకులకుఁ గొంత తెలిసియే యుండును. ఈ రెండు శక్తులు (ప్రాణాపానములు) ఎచట నే విధముగాఁ జేరుకొను ననునదే తెలిసికొనవలసిన విషయము. అపానశక్తి యొక్క స్థానము పాయువు; అనఁగా నపానము ఆధారచక్ర సమీపమున నుండును. దాని గతి క్రిందికే (విలోమముగానే) యగుచుండును. ప్రాణశక్తి హృదయముయొక్క పై భాగమందే పనిచేయుచుండును. అనఁగాఁ బ్రాణశక్తిగతి హృదయముకంటెఁ బైభాగమందే యగుచుండును. ఈ రెండిఁటిని సంయోజించి (చేర్చి) సుషుమ్న వివరమందుఁ బ్రవేశ##పెట్టవలయును. సుషుమ్నా ప్రవేశద్వారము కుండలి స్థానమందున్నది. అది మూలాధార స్వాధిష్ఠానముల నడుమ నుండును; అనఁగాఁ బ్రాణాపానముల రెండిఁటిని నా స్థానమునకు లాగి కొనివచ్చి కలుపవలయును. రెండింటినిఁ గలుపఁగలిగినపుడే సుషుమ్న యందుఁ బ్రవేశించును. ఆ యవస్థనే 'ఘటావస్థ' యందురు. యోగులు కొంచెము ప్రయత్నము చేసినను, దీప్ర సంకల్పము చేసినను బ్రాణప్రవాహము వారుకోరినచోట సులభముగా జరుగును.

1. అపానశక్తి యందుఁ బ్రాణము నాహుతి నిచ్చుటకై యా ప్రాణశక్తిని గ్రిందికి దింపి, యాధారచక్రమునకుఁ దీసికొని పోయి యపానముతోఁ జేర్పవలయును. ఈ క్రియ శ్వాసమును బూరించుట, కుంభించుట యను ప్రయత్నము వలన సహితము సిద్ధించును. శ్వాసమును ఊపిరితిత్తులలోనికి మెల్లమెల్లగా లాగికొని యొత్తిడితోఁ బూరింపవలయును. ఇది పూరకము. మఱియుఁ గంఠమును సంకోచింపఁజేసి జాలం ధరమును మూయుటవలన వాయువును గ్రిందికి గట్టిగా నదుమ వలయును. ఇది కుంభకము. ఈ క్రియ కొంత యలవాటు పడిన తరువాతఁ బ్రాణశక్తి మీఁది భాగమందలి నాడుల దారిని నిడాపింగళా నాడులలోనికి లాగఁబడి క్రిందికి దిగనారంభించును. మఱియు మెల్లమెల్లగాఁ గందముకడ మూలాధారచక్రమం దపానముతో నేకీభవించును. అచట యోగి మొదట నుండియే సిద్ధాసనమును (గుదసంకోచనమును) జేసి మూలబంధమువలన నపానశక్తి నడ్డగించును. ఈ విధముగా రెండును జేరుట యగును.

2. తరువాత రేచకమువలన శ్వాసము మెల్లమెల్లగా వెలికి విడువఁబడును. మఱియు మూలమును బంధించి, పొట్టను వెన్ను వైపున కీడ్చి 'ఉడ్యాణబంధము' చేత క్రింది నాడులనుండి యపానము మీఁది కీడ్చి ప్రాణముతోఁ జేర్చుటగును. ఈ విధముగాఁ బ్రాణాపానము లొండొంటితోఁ జేరుటయగును. ఇదే 'యపానమును బ్రాణమం దాహుతి నిచ్చుట.' ఈ చెప్పఁబడిన రీతిని రెండిఁటి సంయోగమును జేసి సుషుమ్నయందుఉఁ బ్రవేశింపఁ జేయుటచేత యథార్థమైన ప్రాణాయామము సిద్ధించును.

3. తరువాతఁ గుంభించుటచేత శ్వాస ప్రశ్వాసగతి యడ్డగింపఁబడును. మఱియు దానివలనఁ బ్రాణాపానములు రెండును దమ తమ బాహ్యకార్యములు విడిచి యంతర్ముఖములు కాఁజొచ్చును. అందేకాక యా రెండును దమతమ స్వరూపములను విడిచి లయమొందును ఇదే 'ప్రాణాపానగతి నిరోధ' మనెడి మూఁడవ యజ్ఞము.

4. నాల్గవదైన కేవలకుంభకము సిద్ధించినపుడు శ్వాస ప్రశ్వాసము లెట్టి యవస్థయందైనను నడ్డగింపబడియే యుండును. ఈ విధమున శ్వాసగతి నిరోధ మగుటవలన బ్రాణశక్తి నిరోధమును నగును. ప్రాణపంచక నిరోధమగుట వలన శారీరకమైన సర్వ వ్యాపారములు నడ్డగింపఁబడి సమష్టి ప్రాణోత్థాన మగును. అపుడు సమాధ్యవస్థ యారంభమగును. ఈ విధముగాఁ జేయగల యోగి మితాహారియై చాలసేపు సమాధివలని యానందము ననుభవించును. ఇదే ''ప్రాణ ములను బ్రాణ మం దాహుతి నిచ్చుట'' యనఁబడును. దీనికి మూఁడవ యజ్ఞముతో నెంత భేద మున్నదనఁగాఁ - గేవల కుంభనవేళఁ బ్రాణము సర్వచక్రములయందును విలీనమగుట యారంభమగును. అనఁగాఁ బ్రాణము సుషుమ్నయందు నాలుగువిధములుగాను నూర్థ్వముఖముగాఁ బ్రసరించుటగును.

శక్తి జాగరణముచే నది క్రియాపతి కాఁగానే నాలుగు విధముల ప్రాణాయామములు నెట్టి ప్రయత్నము లేకయే సిద్ధించును. శ్రీ శంకరాచార్యులును 'యోగతారావలియందు' కేవల కుంభకమును సొగసుగా వర్ణించిరి. అది పాఠకుల వినోదార్థము వ్రాయఁబడుచున్నది.

శ్లో|| ''బంధత్రయాభ్యాస విపాకజాతాం

వివర్జితాం రేచకపూరకాభ్యాం |

విశోషయన్తీం విషయప్రవాహం

విద్యాం భ##జే కేవలకుంభరూపామ్‌ ||

ప్రత్యాహృతః కేవలకుంభ##కేన

ప్రబుద్ధ కుణ్డల్యుపభుక్తశేషః |

ప్రాణః ప్రతీచీనపథేన మందం

విలీయతే విష్ణుపదాన్తరాలే ||

- యోగతారావలి.

మూలోడ్యాణ జాలంధర బంధరచనమందు నలవాటు పరిపక్వముకాఁగాఁ బూరక రేచకముల ప్రయత్నము లేకయే ప్రకటయై విషయ ప్రవాహమును శోషింపఁ జేయునట్టి కుంభక రూపయైన విద్యను (పరమేశ్వరిని) సేవింతును.

కేవల కుంభకముచేత నీడ్వఁబడి కుండలిని చేత నుపభుక్తము కాఁగా మిగిలిన ప్రాణము మెల్లమెల్లగా సుషుమ్నా పశ్చిమ మార్గమునఁ బయనించి విష్ణుపదాంతరాళమున ననఁగా సహస్రారమందుఁ జేరికొని పరబ్రహ్మమందు లీనమగును.

అపుడు సుషుమ్నా మార్గము వేధింపఁబడఁగాఁ జిత్తమునకు లయావస్థ కలుగును.

కుండలినీ జాగరణశక్తి ఫలముగా సాధకశిష్యునందగు వింతలు.

___________________

ఒకప్పు డొకచోట మాతృకాశక్తి జాగరణమగుట వలన సిద్ధమంత్ర లాభము నగును. మఱియు మాతృకాశక్తి కుండలినీ స్వరూపమే. అది అకారాది క్షకారాంతమైన వర్ణమాలారూపము. ఆ వర్ణమాలచే ఘటితమైన పదవాక్య సముదాయ రూపమున వైఖరీవాణి యను పేరితో వెలువడును. అట్టి యోగినోర సత్‌ పదార్థశోభతోఁ గవితాధార గంగా ప్రవాహమువలె వెలువడుటయే కాక, యతఁడు వేదాది సద్గ్రంథ భాష్యకారుఁడును గాఁగలడు. ఆ విధముగాఁ బ్రకాశించు కుండలినీ పరాశక్తికే 'సరస్వతి' యని పేరు.

ఒక్కప్పుడు శక్తి పాతభాగ్యము నందిన సాధకుఁడు నాట్యము చేయును, గానము చేయును, నవ్వును, ఏడుచును. ఈ భావములన్నియు జాగతికములైన కారణములు లేకయే కుండలినీశక్తి జాగరణ కారణముగానే యగుచుండుట చదువరులు గ్రహింతురుగాక!

కుండలినీశక్తి జాగరణభాగ్యముఁ బడసిన వాఁడొకప్పుడు ప్రణవాది నామముల నుచ్చరించును; ఒకప్పు డాతనియందు దివ్యభావములు - అనఁగా 'బ్రహ్మ - విష్ణు శివాది దేవతా భావములు సంపన్నము లగును. ఇట్టి భావములు విశేష రూపములతో నుదయించునపుడు సాధకయోగి కేవల బాలకునివలెను, బిచ్చివానివలెను, బిశాచగ్రస్తునివలెను లోకులకుఁ గానవచ్చును. ఏలనఁగా నీ యవస్థయందు జీవభావము తఱిగిపోవుటో కేవలము తొలఁగిపోవుటో యై యుండును. పరాభక్తి పూర్ణముగా నావేశించును. కాళిదాస - శంకరా చార్య - జయదేవ - ఆనందతీర్థ - గౌరాంగాదు లైన మహాత్ములయుఁ, బోతనాదులైన సిద్ధులయు దర్శనము, ఇష్టదేవతాదర్శనము నగుచుండును ఊర్థ్వ రేతస్కుఁడు నగును.

ఊర్ధ్వ రేతస్కుఁ డగుటకు వ్రజౌల్యాది సాధనములు యోగ శాస్త్రములందుఁ జెప్పఁబడినవి. ఏది యెట్లున్నను 'బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారీ, తస్య కర్మ బ్రహ్మచర్యమ్‌' బ్రహ్మమందుఁ జరించువాఁడు- అనఁగా లో వెలులను బ్రహ్మ మునే కాంచువాఁడు - అనఁగా నామరూపక్రియా విశిష్ట జగత్తును, 'నేను నే' ననుచు నుపాధులతో వ్యాపించియున్న చైతన్యమయ వస్తువును' ఆత్మను (సర్వత్ర అతతీతి ఆత్మా) సైతము బ్రహ్మముగాఁ గాంచువాఁడు - అనఁగాఁ బరమాణువు మొదలు సర్వమును బ్రహ్మముగాఁ గాంచి చరించువాఁడు బ్రహ్మచారి. అట్టివాఁడై యుండుటయే 'బ్రహ్మచర్యము'. ఉపనయన సంస్కార క్షణాదిగా బండ్రెండు సంవత్సరములు గురుకుల మందుండి దీని నభ్యసించినవాఁడు యథార్థ మేధాసంపన్నుఁడు కాకపోఁడు. 'బ్రహ్మాహ మస్మీతి స్మృతి రేవమేధా' (శ్రీ శంకరగురువులు). మేధ జనించి పెరిగినపుడు దాని ఫలముగాఁ గామాది వికారములు తమంతనే యడఁగుటయు, వీతరాగుఁడగుటయు, భయ క్రోధ మోహాదులు క్రమముగాఁ దలయెత్తకుండుటయు ననెడివి తమంతనే లభించును. కావున నీ బ్రహ్మచర్య మనునది యభ్యసింపఁబడి, తత్ఫలముగా విషయవాంఛలతోఁ గామము కడముట్టునవు డూర్ధ్వరేతస్కుఁ డగుట వింతకాదు. ఈ యథార్థ బ్రహ్మచర్య మలవడనపు డుపాయాంతరములచే నూర్ధ్వరేతస్కుఁడగు ప్రయత్నము కొంత ఫలించినను నది శిథిలమగుట తప్పదు. యథార్థబ్రహ్మ చర్యావస్థయందు సాధకుఁడు స్వరూపజ్ఞానము నొంది, తన రూపములే యైన సత్య జ్ఞానానందములయందుఁ బ్రతిష్ఠితుఁడగుట ననుభవించును. ఇట్టి సౌభాగ్యము పట్టిన సాధకుని యందుఁ బ్రాణశక్తి (చైతన్యశక్తి) ఊర్ధ్వగామిని యగుటచే సర్వేంద్రియములు నంతర్ముఖములు కాఁజొచ్చును. చిత్తము విషయములవలన నుపరతమగును. అనఁగా విషయములనుండి మఱలిపోవును. ఆ ప్రాణశక్తి యూర్ధ్వముఖియై మేరుగిరియొక్క యుత్తమ శిఖరమందలి యుత్తమభూమికకు - అనఁగా సహస్రారమునకుఁ (శివపదమునకు) జేరు భాగ్యముపట్టిన సాధకుని యందు విషయోపరతి సిద్ధమగుట యొక వింత కాదు.

మఱియు నట్టి సాధకుఁ డొక్కొక్కప్పుడు సూర్యుఁడు, చంద్రుఁడు, దీపశిఖ, మెఱుపు, నక్షత్రములు మున్నగు వానిని సాధనకాలమందుఁ గాంచుచుండును. ఆ కాన్పు మూఁడు తెఱఁగుల నగుచుండును. 1. కన్నులు పూర్తిగా విప్పియుండు నపుడు, 2. కనులు మూసికొని ధ్యానించునపుడును - ద్రష్ట, దృశ్యము. దర్శనము నను నీ త్రిపుటితోఁ గూడియుండును. 3. ఇఁక నాంతరదృష్టియందు నీ త్రిపుటిజ్ఞానమే లేక 'సో7హం' భావమనెడి సమాధిస్థితిగానే యుండును.

ఇట్టి చూపులు ఆత్మదేవ (బ్రహ్మ) దర్శనములే. అనఁగా ఆత్మ వస్తురూపముననున్న బ్రహ్మమే చూచుచున్నదని యభిప్రాయము. బ్రహ్మ మవ్యక్తమైనను దాని వ్యక్తత చిత్తముపాధిగా నుండుటవలననే యని గ్రహించునది.

సాధనభూమికా చతుష్టయము.

ఇచట సాధనవిషయమునఁ గ్రమముగా నాలుగు భూమికల విషయము తెలిసికొనఁ దగినది.

1. ఆరంభావస్థ :- దీనియందు జ్ఞానకర్మేంద్రియములు బహిర్ముఖవృత్తిని మాని యంతర్ముఖములు కాఁజొచ్చును.

2. ఘటావస్థ :- దీనియందుఁ బ్రాణము (చైతన్యము) సుషుమ్నామార్గమును వేధించి నఖశిఖాపర్యంతము సుస్థిర మగును.

3. పరిచయావస్థ :- సహస్రారమం దా ప్రాణశక్తి స్థిర పడుటవలనఁ బరిచయావస్థ కలుగును. ఏలన, నచట నాత్మతోడి పరిచయము సంతుష్టిగా నగును.

4. నిష్పత్త్యవస్థ :- ఇదే జీవన్ముక్తావస్థ. సాధకయోగి తన సత్య - జ్ఞాన - ఆనంద భావములందుఁ బ్రతిష్ఠితుఁడై క్రమముగాఁ గేవలానందమయుఁడై యుండును. మఱి యతనికి జన్మబంధములేదు. ముక్తికిని శరీరస్థితిని సంబంధము లేదు. నీవు పైని జెప్పిన యవస్థలనెడి భూమికల నెక్కి నేఁడు ముక్తుఁడవు కావచ్చును. నీ శరీర మింకను గొన్నేండ్లు నిలిచి యుండవచ్చును. అపుడే నీవు జీవన్ముక్తుఁడవు. విద్యుచ్ఛక్తి సహాయముచే వడివడిం దిరుగుచు వాయుచాలనము చేయు వ్యజనయంత్రమునకు (Electric Fan; = మరవిసనకఱ్ఱ) విద్యుత్తుతోడి సంబంధము త్రెంచి వేయఁబడినను - మఱికొన్ని నిముసము లాయంత్రము తిరుగుచునే యుండును. ముక్తుఁడైన తరువాత సైతము గొన్నాళ్ళు శరీరము నిల్చి యుండుటయు నిట్టిదే. ఇదే దృష్టాన్తము.

ఉత్తమ భూమికాధిష్ఠితుని కబ్బు విభూతులు.

పై నిష్పత్త్యవస్థను జేరుకొన్న భాగ్యశాలికి ప్రతిభాది విభూతులును గలుగును. ప్రతిభ యనఁగా నవనవోన్మేషశాలిని యైన ప్రజ్ఞ. అనఁగాఁ గ్రొత్తక్రొత్త యూహములను గలిగించు ప్రకృష్టజ్ఞానమునకే ప్రతిభ యని పేరు. అది విశేషించి సంపన్న మగుటే విభూతి. సాధకోత్తముఁడు పైని జెప్పిన భూమికల నధిరోహించువాఁడైనపుడు వాని కీ ప్రతిభాది సంపదలు మున్ను లేకున్నను వింతగా నబ్బును. ఆదిశబ్దముచేత మతిశబ్దము సైతము గ్రాహ్యము.

యోగసాధనమం దింతదాఁక నధికారము పొందనివాని కీ ప్రతిభాదివిభూతులు సంపన్నములు కావనెడి నియమము లేదు.

ప్రతిభాదు లన్నియుఁ జిత్తధర్మములే యగుటవలన, ఆత్మయందుఁ గావు. అనఁగాఁ బైని జెప్పిన యవస్థలన్నియు ఆత్మవి గావు. ఏలన నవి యన్నియుఁ జిత్తధర్మములే. స్వభావము చేతనే నిత్యుఁడు - అనఁగాఁ ద్రికాలాబాధ్యుఁడు; శుద్ధుఁడు; ఆణవ - కార్మిక - మాయిక మలములు లేనివాఁడు; బుద్ధుఁడు, కేవల బోధస్వరూపుఁడు; ముక్తుఁడు, ఎట్టికట్టుబాటును లేని వాఁడు నైన యాత్మునకు భూమికావిశేషముల నందుట యనెడిది యసంభవము.

పైని జెప్పిన భూమికల కెగఁబ్రాకుటవలన ననఁగా నుత్తరోత్తర భూమికాప్రాప్తివలన నాత్మయొక్క ప్రకాశ స్వరూపమైన జ్ఞానమే సాధకునియం దధిక మగును.

భూమిక లనఁగా నేమి? యనఁగాఁ గ్రమక్రమముగా నధికముగాఁ జిత్తముపైని నాత్మ ప్రకాశము పెంపొందు చుండుటయే.

చిత్తముతోఁ జేరుట యనెడి చిక్కు వచ్చినప్పుడును బంధము కలుగదా? యందువేని - 'కలుగదు'. ఏలన? భూమికాప్రాప్తి ఆత్మకు లేదని మున్నే సిద్ధాంతీకరింపఁబడినది.

చిత్తముతోఁ గూడినంత మాత్రమున నాత్మక బంధము లేదు.

ఆత్మ చిదానంద స్వరూప మగుటవలనను జిత్తమట్టిది కాకుండుట వల్లను నీ భేదము గల్గినది. కావుననే ఆత్మ యేనాఁడును బద్ధముకాదు.

ఆత్మ చేతనము. చిత్తము జడము. కావున రెండిఁటి కిని సంయోగ మసంభవము. ఆత్మ యసంగుఁడు. కావున భూమికత్వమును నసంభవమే. భూమికావాప్తి కేవల చిత్త ధర్మమే.

అటైనచో దానిపైని ఆత్మఖ్యాతి యెటులగు నందు వేని - కేవల మవివేకమువల్లనే యీ ''తాదాత్మ్య మిథ్యాజ్ఞాన'' మని చెప్పవలసివచ్చును.

అసత్తునందు సత్‌ ఖ్యాతి యేనాఁడును సంభవింపదు. ఆత్మకును, జిత్తమునకును దాదాత్మ్య మనునది వట్టి ప్రతీతియే.

సమాహితావస్థయందు (సమాధియందు) అన్ని విధముల వృత్తినిరోధ మైన పైని, ఆత్మసాక్షాత్కార మగుటవలన ('అహం బ్రహ్మా7స్మి' యనెడి భావము, అనుభవము సిద్ధమగుట వలన) నీ యాత్మచిత్త తాదాత్మ్యమును గూర్చిన యవివేకము నశించును.

ఇది శ్రీకాకుళవాసి శ్రీ శ్రియానందనాథ దీక్షానామధారి

ఈశ్వర సత్యనారాయణ శర్మ వ్రాసిన శక్తిపాతము.

సమాప్తము

Shaktipatamu    Chapters    Last Page